పాలరాయి పడతిగా మారింది
మహాశిల్పి వేళ్ళు
రూపుకు తుదిమెరుగులు దిద్దాయి
పెళ్ళిచూపులకు పడతి
పద్మాసనం వేసింది.
విరిసీ విరియని మల్లెలు
బొగడ బేసర వన్నె చిన్నె చూసి
నాగరం నవ్వుకుంది
మధ్య మధ్య అందెల సవ్వడి
వంచిన తల కంటిసిగ్గును కప్పితే
ఒంటి సిగ్గు పట్టుచీరలో వొదిగింది.
అందం సౌందర్యం
లాలిత్యం సౌకుమార్యం
ఆమె సొత్తయి వొదిగాయి
పెళ్ళిచూపుల సూటిప్రశ్నలకు
పడతి మందస్మిత ప్రత్యుత్తరం.
సంగీతానికి భాష్యం చెబుతూ
అన్నమయ్య క్రుతి అందుకుంది
సరిగమల్ని స్ప్రుశించిన వీణ
వీనులవిందై రవళించింది.
ప్రశ్నలు నిండుకున్నాయి
పెళ్ళికుమారుడి హ్రుది
బ్రుందావన విహారం
పెళ్ళిబ్రుందం మది
ముక్తగగనవాహ్యాళి.
మెల్లగా సుతిమెత్తగా
కట్నకానుకల ప్రస్తావన
పాలరాతి పడతి
మనోహర రూప లావణ్యం
రౌద్రాకారం దాల్చింది
భద్రకాళిగా మారింది.
మహాశిల్పి వేళ్ళు
చండికను చెక్కాయి
అక్కడ జవాబు వుంది
ప్రశ్నించడానికి జనం లేరు.
- అద్రుశ్యకుడ్యం (కవితా సంపుటి) నుండి
Feb 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment