Feb 21, 2007

మరణానికి రెండు ముఖాలు (కవితా సంపుటి) నుండి కొన్ని కవితలు:

బడ్జెట్

సంవత్సరానికో సారి
సమర్పించే బడ్జెట్
రాజకీయ కురు సభలో
పేదవాడి వస్త్రాపహరణం

పల్లె-పట్నం

నగరం నిద్రలేచింది
పాలకై
పసిపాపలా ఏడుస్తూంది!
పల్లె నిద్రలేచింది
తల్లై
పాపకు పాలు అందిస్తూంది!


వ్రుద్ద నిరుపేద

ఎట్టకేలకు
నా చూపు
సూది రంధ్రాన్ని
జయించింది!
కానీ
నా అతుకుల బొంత
సూదిని
ఓడించింది!

మారే లెక్కలు

ఇరవై నాలుగులు అరవైయ్యని
కూలీ లెక్కల రోజున
ఇరవై నాలుగులు నూట ఇరవైయ్యని
వడ్డీ లెక్కల రోజున
ఇరవై నాలుగులు ఎనభయ్యని
తనయుడికి టుషన్ రోజున
ఎక్కాల లెక్కలు
వల్లిస్తుంటాడు భూస్వామి!

No comments: