Feb 23, 2007

ప్రవాహిని

జీవం తెగి వర్తమానం
ఆ ఇంట వేలాడుతూ తోరణాలు
ఎంతకూ ఎండిన పొయ్యి రాజుకోదు
ఎసరు పైకెక్కదు
కాలం పరుగును కొలుస్తూ
గడియారం నడుస్తూంది.
అంతవరకు ఉయ్యాల్లో కేరింతలేసిన
పసిబిడ్డ మగతగా నిద్ర.
కడుపు ఎండిన
రామచిలుక స్వాగతం మరిచి
గూట్లో నిశబ్దం.
గింజలేని వరికంకుల్ని చూసి
వాకిట పిచ్చుకలు ఒకటే రొద.
పొద్దెక్కినా పలుపులు విప్పని
పశువుల దప్పిక చూపులు.
తల్లి పాలకోసం
మోరెత్తి నిల్చిన లేదూడలు.
వేళ మారినా రాని చద్ది కోసం
మడి ఎదురుతెన్నులు.
కారణం అమ్మ లేవలేదు
అస్వస్ధత అమ్మను లేవనియ్యలేదు
మూసిన కన్ను తెరవాలని
అమ్మ ఎంత యత్నించినా
కనురెప్పలు కంటి ఆధీనంలో లేవు
అమ్మతనం కొలవడానికి
అమ్మ ఆవేదన అర్ధంచేసుకోడానికి
అమ్మకే సాధ్యం
అమ్మను కన్న అమ్మ వుంటే బాగుణ్ణు
అమ్మకన్న అమ్మయినా బాగుణ్ణు.

- అద్రుశ్యకుడ్యం (కవితా సంపుటి) నుండి

3 comments:

తెలు'గోడు' unique speck said...

quite touching....

Anil Atluri said...
This comment has been removed by the author.
Anil Atluri said...

అడిగోపుల గారికి నమస్తే!
సమయమున్నప్పుడు మీ ఫొను వివరాలటొ ఒక మెల్ పంపండి.