Feb 27, 2007

వెలుగు వెల్లువ

పలకబట్టి బయలుదేరితే
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.

- రాతిచిగుళ్ళు (కవితా సంపుటి) నుండి

Feb 26, 2007

బదులుకు ప్రశ్నేది

పాలరాయి పడతిగా మారింది
మహాశిల్పి వేళ్ళు
రూపుకు తుదిమెరుగులు దిద్దాయి
పెళ్ళిచూపులకు పడతి
పద్మాసనం వేసింది.
విరిసీ విరియని మల్లెలు
బొగడ బేసర వన్నె చిన్నె చూసి
నాగరం నవ్వుకుంది
మధ్య మధ్య అందెల సవ్వడి
వంచిన తల కంటిసిగ్గును కప్పితే
ఒంటి సిగ్గు పట్టుచీరలో వొదిగింది.
అందం సౌందర్యం
లాలిత్యం సౌకుమార్యం
ఆమె సొత్తయి వొదిగాయి
పెళ్ళిచూపుల సూటిప్రశ్నలకు
పడతి మందస్మిత ప్రత్యుత్తరం.
సంగీతానికి భాష్యం చెబుతూ
అన్నమయ్య క్రుతి అందుకుంది
సరిగమల్ని స్ప్రుశించిన వీణ
వీనులవిందై రవళించింది.
ప్రశ్నలు నిండుకున్నాయి
పెళ్ళికుమారుడి హ్రుది
బ్రుందావన విహారం
పెళ్ళిబ్రుందం మది
ముక్తగగనవాహ్యాళి.
మెల్లగా సుతిమెత్తగా
కట్నకానుకల ప్రస్తావన
పాలరాతి పడతి
మనోహర రూప లావణ్యం
రౌద్రాకారం దాల్చింది
భద్రకాళిగా మారింది.
మహాశిల్పి వేళ్ళు
చండికను చెక్కాయి
అక్కడ జవాబు వుంది
ప్రశ్నించడానికి జనం లేరు.

- అద్రుశ్యకుడ్యం (కవితా సంపుటి) నుండి

Feb 23, 2007

ప్రవాహిని

జీవం తెగి వర్తమానం
ఆ ఇంట వేలాడుతూ తోరణాలు
ఎంతకూ ఎండిన పొయ్యి రాజుకోదు
ఎసరు పైకెక్కదు
కాలం పరుగును కొలుస్తూ
గడియారం నడుస్తూంది.
అంతవరకు ఉయ్యాల్లో కేరింతలేసిన
పసిబిడ్డ మగతగా నిద్ర.
కడుపు ఎండిన
రామచిలుక స్వాగతం మరిచి
గూట్లో నిశబ్దం.
గింజలేని వరికంకుల్ని చూసి
వాకిట పిచ్చుకలు ఒకటే రొద.
పొద్దెక్కినా పలుపులు విప్పని
పశువుల దప్పిక చూపులు.
తల్లి పాలకోసం
మోరెత్తి నిల్చిన లేదూడలు.
వేళ మారినా రాని చద్ది కోసం
మడి ఎదురుతెన్నులు.
కారణం అమ్మ లేవలేదు
అస్వస్ధత అమ్మను లేవనియ్యలేదు
మూసిన కన్ను తెరవాలని
అమ్మ ఎంత యత్నించినా
కనురెప్పలు కంటి ఆధీనంలో లేవు
అమ్మతనం కొలవడానికి
అమ్మ ఆవేదన అర్ధంచేసుకోడానికి
అమ్మకే సాధ్యం
అమ్మను కన్న అమ్మ వుంటే బాగుణ్ణు
అమ్మకన్న అమ్మయినా బాగుణ్ణు.

- అద్రుశ్యకుడ్యం (కవితా సంపుటి) నుండి

Feb 21, 2007

అడిగోపుల గురించి ఆచార్య ఆరుద్ర గారు

పిడికిలి బిగించి ప్రజలు
మ్మడిగా మన ఈ వ్యవస్ధ మార్చేదాకా
పెడబొబ్బ సింహనాదం
అడిగోపుల హోరుగాలి ఆగవు సుమ్మి! - ఆరుద్ర

మరణానికి రెండు ముఖాలు (కవితా సంపుటి) నుండి కొన్ని కవితలు:

బడ్జెట్

సంవత్సరానికో సారి
సమర్పించే బడ్జెట్
రాజకీయ కురు సభలో
పేదవాడి వస్త్రాపహరణం

పల్లె-పట్నం

నగరం నిద్రలేచింది
పాలకై
పసిపాపలా ఏడుస్తూంది!
పల్లె నిద్రలేచింది
తల్లై
పాపకు పాలు అందిస్తూంది!


వ్రుద్ద నిరుపేద

ఎట్టకేలకు
నా చూపు
సూది రంధ్రాన్ని
జయించింది!
కానీ
నా అతుకుల బొంత
సూదిని
ఓడించింది!

మారే లెక్కలు

ఇరవై నాలుగులు అరవైయ్యని
కూలీ లెక్కల రోజున
ఇరవై నాలుగులు నూట ఇరవైయ్యని
వడ్డీ లెక్కల రోజున
ఇరవై నాలుగులు ఎనభయ్యని
తనయుడికి టుషన్ రోజున
ఎక్కాల లెక్కలు
వల్లిస్తుంటాడు భూస్వామి!

Feb 20, 2007

జీవన పోరాటం (కవితా సంపుటి) నుండి కొన్ని పంక్తులు:

"రోడ్డెంబడి
మైలు రాయి విలపిస్తోంది
ప్రగతి పధం లో
తన స్ధానం లేనందుకు"

"ఈ దేశపు రాజకీయాల్లో
ప్రజాస్వామ్యం పరుగెత్తుకెళ్ళి
బుల్లెట్ ప్రూఫ్ అద్దాల గదిలో దాక్కుంది"

జీవన పోరాటం (కవితా సంపుటి) నుండి కొన్ని కవితలు :






కదలని ఫైలు
మూడు మూళ్ళ తొమ్మిదని
రాసాడు గుమాస్తా!
కాదన్నాడు హెడ్ గుమాస్తా!
రెండిటినీ
నిరూపించమన్నాడు
ఆఫీసరు!
ఎక్కాల బుక్కు
మార్కెట్ లో దొరకలేదు
అందుకే ఆ ఫైలు
ఆరు నెలలుగా
అక్కడనుండి కదలలేదు!

కాగితం పడవ

ఉదయం నుండి ఒకటే వర్షం
ఆకాశం తూట్లు పడినట్లు
పొయ్యి లో పిల్లి లేవలేదు
లేపమని
లేపలేమని దానికి తెలుసు
గుడెశలో ప్రతి అంగుళం కురుస్తోంది
ప్రవాహమై పారుతోంది
కుర్రాడు కాగితం పడవలు వదుల్తూ
సంతోషంతో కేరింతలు కొడ్తున్నాడు
పడవలు చెయ్యమని ప్రాణాలు తీస్తున్నాడు
చేసివ్వకపోతే ఆకలని ఏడుస్తున్నాడు
మా జీవితం కాగితం పడవని
అనుక్షణం గుర్తుచేస్తున్నాడు!

- జీవన పోరాటం (కవితా సంపుటి) నుండి

Feb 16, 2007

పరిపూర్ణ కవితా సంపుటాలు

విశ్వగీతం - ఆదివారం ఆంధ్రప్రభ సమీక్ష

విశ్వగీతం - ఆంధ్రభూమి వారపత్రిక సమీక్ష

విశ్వగీతం - ఆంధ్రభూమి సమీక్ష

కవిత్వానికి కొత్త పరిమళాలు - పియల్యన్ యస్

శ్వేత పత్రం - విశాలాంధ్ర సమీక్ష

శ్వేత పత్రం - తెలుగు విద్యార్ధి సమీక్ష

శ్వేత పత్రం - వార్త దిన పత్రిక సమీక్ష

శ్వేత పత్రం - ప్రస్ధానం పత్రిక సమీక్ష

శ్వేత పత్రం - ఆంధ్ర ప్రభ ఆదివారం సమీక్ష

శ్వేత పత్రం - సమీక్ష

శ్వేత పత్రం సమీక్ష

శ్వేత పత్రం - వార్త సమీక్ష

శ్వేత పత్రం - ఈనాడు సమీక్ష

శ్వేత పత్రం ముఖచిత్రం